Eatala Rajender: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 04:39 PM IST

 Eatala Rajender: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటివరకు కిషన్ రెడ్డినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూనే అటు కేంద్రమంత్రిగానూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పుడు రెండోసారి కిషన్ రెడ్డి ఘన విజయం సాధించడం కాకుండా వరుసగా రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు ఇస్తే బాగుంటుందనే చర్చ ఢిల్లీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమిత్‌షాను కలిసిన ఈటల..( Eatala Rajender)

బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. అందుకే కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను నియమించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం..తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది. మరోవైపు అమిత్‌షాను ఈటల రాజేందర్‌ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి లాగడంలో ఈటల విజయం సాధించారు. అంతేకాదు..బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లకుండా వారితో చర్చలు జరిపారు. అభ్యర్థుల తరపున ప్రచారంలోనూ ఈటల కీలక బాధ్యతలను నిర్వర్తించారని పార్టీ నేతలు చెప్తుంటారు.