Telangana Cabinet Expansion: తెలంగాణలో ఎన్నికల హడావుడి మిగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్‌లో 18 మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా..మిగిలిన ఆరుగురు ని కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట.
జూలై 4లోగా విస్తరణ చేపట్టేందుకు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు.. మంత్రులు, భట్టి, ఉత్తమ్ లు ఢిల్లీ వెళ్లారు. ఇక మూడు రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్న దీపాదాస్ మున్షీతో పాటు.. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు అధిష్టానం నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ విస్తరణలో మంత్రి వర్గంలో ప్రాతినథ్యం లేని జిల్లాలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ మారిన నేపధ్యంలో భట్టి, ఉత్తమ్ ఇరువురు కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తనను సంప్రదించకుండా జగిత్యాల బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ను ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తానని తన సన్నిహితులతో చెబుతున్నారు. అలకబూనిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వెళ్లి చర్చలు జరపడంతో కొంత శాంతించినట్లే కనిపించారు. నిన్న సచివాలయంలో భట్టి చాంబర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు భేటి అయ్యారు. జీవన్ రెడ్డి పరిణామాలపై ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.