KTR: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని ఆయన కొనియాడారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలోగిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు.
వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన పార్టీ..(KTR)
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని ఆరోపించారు. మేనిఫెస్టోలోలేని హామీలను కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందని గుర్తు చేశారు.నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిననాడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని ట్వీట్ చేశారు.
ఎదురుదాడులకి కేరాఫ్ అడ్రస్ డ్రామారావు..
మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. నిస్సిగ్గు మాటలు ఎదురుదాడులకి కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అని ఆయన అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మోదీతో కలిశారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీతోపాటు.. బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేశారని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కారన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని మీరే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని ట్వీట్ చేశారు