AP Global Investors Summit : జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ.. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోందని.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి. ఇప్పుడు కీలక సమయంలో జీఐఎస్ నిర్వహించామన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించాం. ఏపీ అభివృద్ధికి ఈ 15 సెక్టార్లు అత్యంత కీలకం అని తెలిపారు.
ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయి. వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారు. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్ నిర్వహించాం. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లయ్యింది. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయి. గ్రీన్ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకం. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. మీ అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారింది అని సదస్సు ముగింపు ప్రసంగంలో ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.
కోవిడ్ కష్టాలను అధికమించి.. మూడేళ్లుగా రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోంది
– సీఎం వైయస్ జగన్@ysjagan #AndhraPradesh #APGIS2023 #AdvantageAP #APGlobalInvestorsSummit #APGlobalInvestorsSummit2023 pic.twitter.com/5qDFzYUTyQ
— YSR Congress Party (@YSRCParty) March 4, 2023
మంత్రులు గుడివాడ అమర్నాధ్, రోజా, ధర్మాన ప్రసాద్, విడదల రజని, సీదిరి అప్పలరాజు తదతరులు పాల్గొనగా.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సదస్సులో భాగంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్ తోపాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కే ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి, హెటెరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ, లారస్ ల్యాబ్స్ సీఈవో సత్యనారాయణ చావా తదితరులు మాట్లాడారు. ఏపీలో తాము 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ చెప్పారు. కెమికల్స్, లాజిస్టిక్స్, ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/