CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యతని సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులని విడుదల చేయాలని కోరనున్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగులో ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశమివ్వాలని విన్నవించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.