CM Jagan: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు జగన్ . చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్.
చంద్రబాబువి సాధ్యం కాని హామీలు..( CM Jagan)
మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని , ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? అని పేర్కొని గోవిందా.. గోవిందా.. అని నినదించారు . ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదని చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా అని అన్నారు . రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.అని ప్రశ్నించారు .
ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు . చోడవరం చేరుకున్న సీఎం జగన్‌కు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు స్వాగతం పలికారు. జగన్ రాక సందర్భంగా కొత్తూరు జంక్షన్ జనసంద్రంగా మారింది.