Chandrababu Naidu: తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..(Chandrababu Naidu)
తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించే కృషి చేశానని తెలిపారు. ఓటమి భయంతోనే జైలులో బంధించి, ప్రజా జీవితం నుంచి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దసరాకి రాజమండ్రి నుంచి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని అన్నామని., కానీ అదే రాజమండ్రి జైలులో తనను ఖైదు చేశారని గుర్తు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని తెలిపారు. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు.45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది. నేను త్వరలో బయటకొస్తాను.ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను.
జనమే నా బలం.. జనమే నా దైర్యం…
జనమే నా బలం.. జనమే నా దైర్యం. దేశ విదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దుతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్దనలు ఫలిస్తాయి. మీ అభిమానం, ఆశీస్సులలో త్వరలోనే బయటకు వస్తాను. అంతవరకూ నియంత పాలనపై శాంతియుత పోరటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినాకాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.