Angallu Case: అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
అంగళ్ళు విధ్వంసం కేసులో ఏ-1గా చంద్రబాబు.. (Angallu Case)
ఈ ఏడాది ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా టీడీపీ – వైసిపి కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై తెదేపా నేతలు హైకోర్టులను ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్ లభించింది. ఆ తర్వాత మరికొంతమందికి బెయిల్ మంజూరైంది. తాజాగా చంద్రబాబు నాయుడికి కూడా బెయిల్ దక్కడంతో ఊరట లభించినట్లయింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యుడీషియల్ రిమాండ్ గడువు ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుని సమగ్ర దర్యాప్తుకోసం సిబిఐకి అప్పగించాలని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసుని సిఐడినుంచి తక్షణమే సిబిఐకి బదిలీ చేయాలని ఉండవల్లి కోరుతున్నారు.