Chandrababu Naidu: జీవో నెంబర్ 1ను కావాలనే తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన సందర్భంగా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎక్కడలేని విధంగా జీవో 1 ని తీసుకొచ్చారని బాబు ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షాలపై కక్ష సాధించినడం కోసమే జగన్ జీవో 1 అనే నల్ల చట్టాన్ని ప్రవేశ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని, తన చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లారని మండిపడ్డారు. కావాలంటే తనపై కూడా కేసు పెట్టుకోవాలని… తాము పోలీసు వ్యవస్థపైనే కేసులు పెడతామని తెలిపార. జగన్ పని అయిపోయిందని… అన్ని రంగాల్లో ఆయన ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అన్నారు.
ప్రజల్లో ప్రభుత్వం పట్ల అభద్రతా భావం పెరిగిందని… అందుకే తెదేపాకు పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం ప్రశాంతంగా ఉండే కుప్పంలో… రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే తాను పర్యటించే సమయంలో ఒక డీఎస్పీ కూడా తనతో పాటు ఉండాలని… ఇక్కడ డీఎస్పీ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తన వాహనాన్ని ఎందుకు తీసుకెళ్లారో ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారి ఎవరైనా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పోలీసుల సహకారం కావాలని… కానీ కొందరు పోలీసులు ప్రభుత్వ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అందరూ చూస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.