Chandrababu-Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది. దానితో ఇవాళ అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులను తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్ నేతలు కూడా హాజరయ్యారు.
ఫ్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని..(Chandrababu-Pawan Kalyan)
వైసీపీ నేతలు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. సచివాలయ సిబ్బందితో ఎన్నకలకు వెళ్లాలని చూస్తున్నారని అలాంటివి జరగకుండా అడ్డుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామన్నారు. ఎన్నికలను అపహాస్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని అందులో భాగంగానే వాలంటీర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లపై సాక్ష్యాలతో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.టీడీపీ, జనసేన నేతలపై సుమారు 7 వేల కేసులు పెట్టారు.తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయి.ఏపీలో ఆ పరిస్థితి లేదని చంద్రబాబు తెలిపారు.
దొంగఓట్ల నమోదు..
ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల అధికారులు రాష్ట్రానికి వచ్చారని అన్నారు. చంద్రగిరితో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దొంగ ఓట్లు నమోదు అయ్యాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి హానీ చేయాలని చూస్తూ సహించేది లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా దారుణాలు జరిగాయని వాటన్నిటినీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సారి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు.టీడీపీ, జనసేన కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెడుతున్నారు.సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించవద్దని కోరామని పవన్ కళ్యాణ్ చెప్పారు.