Sajjala Ramakrishna Reddy:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు సజ్జల పై కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.
ఇంతకీ సజ్జల ఏమన్నారు ?..(Sajjala Ramakrishna Reddy)
వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని పిర్యాదులు అందాయి . కౌంటింగ్ రోజు మన టార్గెట్ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని పని చేయాలనీ చెప్పారు . అవతలివారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో అవన్నీ చేయాలనీ సూచించారు . రూల్ అలా ఉంది దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదని వ్యాఖ్యానించారు .
మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది తెలుసుకోండని వివరించారు . ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు” అని సజ్జల రామకృష్ణారెడ్డి ఖరాకండిగా చెప్పారు . దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.