Site icon Prime9

KCR: తెలంగాణ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఎంపీలు పోరాడాలి..కేసీఆర్

KCR

KCR

KCR: తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్‌ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.

ఎంపీలకు సూచనలు..(KCR)

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ నదీజలాల కేటాయింపు, ఉమ్మడి ఆస్తుల బదలాయింపుతోపాటు రాష్ట్ర విభజనలో పెండింగ్‌లో ఉన్న హామీల అమలు కోసం పోరాడిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. తెలంగాణ హక్కులను అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ ఎస్ ఎంపీలపై ఉందని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వచ్చే ఎన్నికలకు రూపొందించాల్సిన ప్రణాళికలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావుతోపాటు పార్టీ ఎంపీలు రాములు, బిబి పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వావిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారధి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవరకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్), హరీష్ రావు పాల్గొన్నారు.

 

Exit mobile version
Skip to toolbar