Priyanka Gandhi: ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
తెలంగాణను ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియాల రూపంలో లూటీ చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో వేలకోట్ల భూములు కబ్జా చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసింది. ఉద్యోగాలు నింపే ప్రక్రియలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు.బీఆర్ఎస్, బీజేపీ పూర్తిస్థాయిలో కలిసిపోయాయని అన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా..మేం ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ తయారు చేసింది. ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు ఇచ్చాం. వాటిని అమలు చేసి తీరుతామని చెప్పారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరని అన్నారు. 2004లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఈ మేరకు 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మూడెకరాల భూమి ఇస్తామన్న బీఆర్ఎస్ హామీ ఏమైంది? రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న హామీ బీఆర్ఎస్ నెరవేర్చిందా? అంటూ రాహుల్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నాం. వరి ధాన్యానికి ఎక్కువ మద్దతు ధర ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నాం. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ఐదు హామీలను నెరవేర్చాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్ గడ్డనుంచి సోనియా గాంధీ ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెంగాణ ప్రకటించారని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం ఆరు గ్యారంటీ స్కీములతో ప్రజలముందుకు వచ్చారని అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డులను స్వామి వారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించారు. వీరివెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరులు ఉన్నారు.