Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. తెలంగాణలో రామరాజ్యం, మోదీరాజ్యం ఏర్పాటు కోసం కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు.
ఇదే విలువైన బహుమతి..(Bandi Sanjay)
మరోవైపు బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పార్టీకోసం కష్టపడి పనిచేసారని, మంచి జోష్ తీసుకు వచ్చారని మోదీ అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. బండి సంజయ్ కుమారులతో మాట్లాడి వారు ఏం చదివారో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని బండి సంజయ్ ట్విటర్ లో షేర్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తమకు కేటాయించిన ప్రతీ సెకనూ తమకు ఎంతో ప్రత్యేకమైనదని విలువైన బహుమతని పేర్కొన్నారు.