Bandi Sanjay Comments: ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పునరావాస కేంద్రంగా టీటీడీ..(Bandi Sanjay Comments)
ఎర్రచందనం పేరుతో దొంగ దందాలు చేసి జాతీయ సంపదను దోచుకున్నారని సంచలన కామెంట్ చేశారు. ఇలాంటి వారు ప్రస్తుతం రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారన్నారు. ఇతర మతస్తులకు టీటీడీ బాధ్యతలను అప్పగించడంవల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని అన్నారు.స్వామివారి ఆస్తులకు పంగ నామాలు పెట్టిన నయవంచకులు పోయారని ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు. గత ఐదేళ్లుగా టీటీడీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందన్నారు. తాను చాలా సందర్భాల్లోచెప్పినట్లు ఇతర మతస్తులకు అప్పగించడం వల్ల తిరుమలలో ఇన్ని అనర్థాలు జరిగాయన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదని తేల్చి చెప్పారు.