Asaduddin Owaisi: హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఎంఐఎంకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బీజేపీ కె మాధవీలతను బరిలో నిలిపింది. హైదరాబాద్‌లోని అతి పెద్ద ఆస్పత్రి విరంచికి ఆమె డైరెక్టర్.. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఆస్తి రూ.221 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆమె పాత బస్తీలోని పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉచితంగా వైద్య సేవలందించారు. తనకు హైదరాబాద్ పాతబస్తీ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కలిగి ఉన్నారు కాబట్టి ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది.
బీజేపీ నుంచి గట్టి పోటీ..(Asaduddin Owaisi)
గతంతో పోల్చుకుంటే ఈసారి ఓవైసీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొబోతున్నారు. దీంతో ఆయన తన నియోజకవర్గంలో శనివారం నాడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా వరుసగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. కాగా తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి మసీదు వైపు చూస్తూ బాణాన్ని వదిలారని ఓవైసీ ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను భంగం కలిగించడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైసీ. వీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు.. మసీదును చూస్తూ బాణం వదలడం అంటే .. నగరంలో శాంతిభద్రతలను భంగం చేయడమేనని ఓవైసీ శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీపై ధ్వజమెత్తారు.
1984 నుంచి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఓవైసీ కుటుంబమే పోటీ చేసి గెలుస్తూ వస్తోంది. అయితే మజ్లిస్ బచావో తెహరిక్ లేదా ఎంబీటీ .. ఎంఐఎంకు బద్ధ శత్రువు .. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంబీటీ నుంచి అంజాద్ ఉల్లా ఖాన్ పోటీ చేయాల్సింది. అయితే ముస్లిం మత పెద్దలు నచ్చచెప్పడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కాగా ఎంబీటీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ముస్లిం కమ్యూనిటీ ప్రయోజనం కోసం బరిలోంచి తప్పుకుంటున్నామన్నారు. ఎన్నికలో బీజేపీ ఓడిపోతే అది ఎంబీటీ విజయమని ఆయన అన్నారు. తమ పార్టీకి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో 1.5 లక్షల ఓట్లు సాధించే సత్తా ఉందన్నారు. ముస్లిం కమ్యూనిటి కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తానికి చూస్తే గతంతో పోల్చుకుంటే ఓవైసీ మాధవీలతతో గట్టి పోటీని ఎదుర్కొబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.