AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌కు వెళ్లారు.
ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం..( AP Assembly Session)
ఎమ్మెల్యేగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. అసెంబ్లీ గేటు వద్దకు జగన్ రాగానే..టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఇక అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకరు ఛాంబరులోనే వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయంలో సభలోకి అడుగుపెట్టారు.
అయితే మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ అభ్యర్థించారు. ఈ అభ్యర్ధనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ కోరినట్టే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కారం చేశారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు.