Site icon Prime9

AP CM Ys Jagan : ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. నేడు జమ కానున్న వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత నగదు

cm ys jagan going to inaguarate varikapudisela project in palnadu district

cm ys jagan going to inaguarate varikapudisela project in palnadu district

AP CM Ys Jagan : జగన్ సర్కార్ ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేడు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ ఈరోజు జమ చేయనున్నారు.

నేడు ఏలూరు జిల్లాకు సీఎం జగన్‌.. 

సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్‌ ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించారు. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించారు. ఇప్పుడు మళ్లీ అక్కచెల్లెమ్మలకు మరో రూ.6,419.89 కోట్లు మూడో విడతగా అందచేయనున్నారు. తద్వారా మూడు విడతలలో మొత్తం రూ.19,178.17 కోట్ల మేర 78.94 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది.

 

‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు లేఖలు రాశారు. మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చెప్పింది చేసి చూపించే చేతల ప్రభుత్వమన్నారు. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తానని ఇచ్చిన మాటను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.

మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. మేనిఫెస్టోను పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి హామీల అమలుకు క్యాలెండర్‌ను ముందే ప్రకటించి 98.5 శాతం నెరవేర్చిన ఏకైక  ప్రభుత్వం తమదని.. మహిళాభివృద్ధి ద్వారానే మన కుటుంబాభివృద్ధి జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణ మస్తు, ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నామన్నారు. అన్ని నామినేషన్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేశామని.. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Exit mobile version