Site icon Prime9

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 29 వరకు జ్యుడిషియల్  రిమాండ్

YS Viveka Murder Case

YS Viveka Murder Case

YS Viveka Murder Case: దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌దేవ్‌ శర్మ నుంచి సీబీఐ అధికారులు పలు విషయాలను సేకరించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన కేసుకు సంబంధించి పలు వివరాలు అందజేశారు. దాదాపు గంటపాటు సీబీఐ ఆఫీస్ లోనే ఉన్న రాహుల్‌దేవ్‌ శర్మ.. అధికారులు అప్పుడు జరిగిన పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. వివేకా నందా రెడ్డి హత్య కేసులో గతంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్ లో కూడా రాహల్‌ దేవ్‌ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలపైన ఆయన్ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను అప్పటి ఎస్పీ రాహుల్‌ దేవ్‌కు కుటుంబ సభ్యులు అందజేశారు. వాటి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

 

కోర్టుకు హాజరైన భాస్కర రెడ్డి(YS Viveka Murder Case)

మరోవైపు వివేకా కేసులో అరెస్టు అయిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో వారి ఇద్దరిని అధికారులు నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఈ నెల 29 వరకు, ఉదయ్‌కుమార్‌ రెడ్డికి ఈ నెల 26 వరకు జ్యుడిషియల్  రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 

అవినాష్ ముందస్తు బెయిల్ పై స్టే

కాగా, ఈ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై.. వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. సునీత తరపు వాదనలు విన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ హైకోర్టు అలాంటి నిబంధనలు విధించడం సరికాదని వ్యాఖ్యానించింది.

హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు పై ప్రభావం పడుతుందన్న సుప్రీం.. జూన్ 30 వరకు సీబీఐ దర్యాప్తు గడువును పొడిగించింది. మరో వైపు ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని అవినాష్ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. అయితే మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్టు చేయొద్దని విజ్ధప్తి చేశారు. అయితే అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదే విధంగా విచారణ సమయంలో నిందితులకు సీబీఐ లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని సుప్రీం వ్యాఖ్యానించింది.

 

Exit mobile version