Tirupati: మతోన్మాదుల వ్యతిరేకంగా నడుంబిగించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపిఐ) యంగ్ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ మార్చ్ నాయుడుపేటకు చేరుకొనింది. విజయవాడలో జరగుతున్న 24వ జాతీయ మహా సభల నేపధ్యంలో కేరళ కొల్లం నుండి ప్లాగ్ మార్చ్ ను సీపిఐ చేపట్టింది. ఈ క్రమంలో నాయుడుపేటకు చేరుకొన్న నేతలు తొలుత బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. జాతీయ మహా సభలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ నేతలు మాట్లాడుతూ భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని విచ్చన్నం చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీనం చేస్తూ, కార్పొరేట్లకు ధారాదత్తం చేసారని విమర్శించారు. నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ప్రధాని మోదీ పాలనలో ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లౌకికవాదమా, మతోన్మాదమా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ప్రజలకు ఆసన్నం అయిందన్నారు. రాష్ట్రానికి చెందిన వైకాపా, తెదేపా లు మోదీతో దోస్తీ చేస్తారా లేదో నిర్ణయించుకోండంటూ విజ్నప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతలు సుజంధర్ మహేశ్వరి, తిరుమలై రామన్, దినేష్ లతో పాటు స్థానిక నేతలు గుజ్జల ఈశ్వరయ్య, సుధాకర రెడ్డి, వల్లివుల్లా ఖాద్రి, జాన్సన్ బాబు, నాగేంద్రబాబు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 29వ రోజుకు చేరుకొన్న అమరావతి రైతుల పాదయాత్ర