Andhra Pradesh: ఇటీవల వివాదాలతో వార్తల్లో కెక్కిన వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం టీచర్ అవతారం ఎత్తారు. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. నేచురల్ సైన్స్ లో ని రిప్రొడక్టీవ్ సిస్టం గురించి విద్యార్దులకు బోధించారు. బ్లాక్ బోర్డుపై పాఠ్యాంశాలను వివరిస్తూ చెప్పారు. అనంతరం పలు ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు.
ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే టీచర్లను అడిగి క్లారిఫై చేసుకోవాలని అన్నారు. శ్రీదేవి పాఠాలు చెబుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొద్దిరోజుల కిందట తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడం పై ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు.