Andhra Pradesh: కాపు జాతిని వైసీపీ మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు అమ్మేశారని జనసేన నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కుల ప్రస్తావన లేకుండా ముందుకు వెళ్లాలన్నదే పవన్ సంకల్పమన్నారు. కానీ జగన్ పెంపుడు కుక్కల్లా వైసీపీ కాపు నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండించేందుకే సమావేశం అయ్యామని తెలిపారు.
త్వరలో విజయవాడ వేదికగా జనసేన కాపు నేతల రాష్ట్ర సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అవసరమైనప్పుడల్లా వంగవీటి రంగా ను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకాన్ని వక్రీకరించి చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నేటి సభలో బూరగడ్డ అనిల్ ను శిక్షించాలని పవన్ ను సీఎం చేయాలని తీర్మానించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
పవన్ సీఎం కావాలని వైసీపీ మంత్రులు కూడా స్పష్టం చేశారని ఆయన గుర్తు చేసారు. పవన్ కాకుండా వేరే వ్యక్తులు సీఎం అయితే కాపులు సహకరించరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అని ఈ విషయాన్ని అందరికి స్పష్టం చేస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమవేశం జరిగిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలమూలల నుంచి జనసేన కాపు నేతలు తాడేపల్లిగూడెంకు చేరుకున్నారు.