YCP leader occupied school building: పాఠశాలను కబ్జా చేసిన వైసిపి నేత

వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు

Panyam:వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు.

వ్యవహారాన్ని స్థానికులు బయటపెట్టడంతో ఉలిక్కి పడడం అధికారులు, నేతల వంతైంది. వివరాల్లోకి వెళ్లితే, నంద్యాల జిల్లా పాణ్యం పట్టణం ఇందిరానగర్ లోని ఓ మూతబడిన పాఠశాలపై ఓ వైసిపి నేత కన్ను పడింది. ఇంకేముంది వెంటనే పాఠశాలలోని శిలాఫలకాన్ని, బోర్డు తొలగించేసాడు. దర్జాగా రెండు గదులు, మెట్లు, వంటగది, బాత్ రూములు, హాలు చకచకా నిర్మించేసాడు. ఇదంతా స్థానిక అధికారుల సహాయంతో పూర్తి చేసేసాడు. ఆ పై ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో పాఠశాల ఆక్రమణలో అతనికి ఎదురులేకుండా పోయింది.

స్థానికులు సమాచారం ఇచ్చినా నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు అధికారులు స్పందించకపోవడంతో తెదేపాకు చెందిన మాజీ జడ్పీటీసి సభ్యురాలు నారాయణమ్మ కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవడంతో విషయం కాస్తా బయటపడింది.

దీని పై ఎంఇవో స్పందిస్తూ పాఠశాల భవనం ఆక్రమణ గురైన్నట్లు తనకు తెలీదని పేర్కొన్నారు. 2013లో రాజీవ్ విద్యా మిషన్ పధకం ద్వారా రూ. 5.30 లక్షల ఖర్చుతో అప్పటి ప్రభుత్వం పాఠశాలను నిర్మించారు. ఆనాటి నుండి విద్యార్ధుల సంఖ్య తగ్గుతుండడంతో 5 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసేసారు. ఇదే అదనుగా చూస్తున్న వైసిపి నేత బరి తెగించి మరీ పాఠశాల భవనాన్ని ఇంటిగా మార్చేసాడు.

వ్యవహారం కాస్తా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలియడంతో వైకాపా ప్రభుత్వం నాడు-నేడు అంటూ ట్వీట్ చేసాడు. విద్యార్ధులు రాకపోతే పాఠశాలకు చేర్చే మార్గాన్ని చూడాల్సిన ప్రభుత్వం,  పాఠశాల భవనం వైకాపా నేతకు కబ్జాగా మారడం పట్ల తీవ్రంగా తప్పు బట్టారు.