Andhra Pradesh: మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజా పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబం పై అవాకులు చవాకులు పేలుతున్న రాజాకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
మహనీయుడు ఎన్టీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి రాజా ఫినాయిల్ తో ఆ నోటిని శుభ్రం చేసుకోవాలని జవహర్ సూచించారు. అసలు ఎన్టీఆర్ తో వైస్సార్ ను పోల్చడమేంటి, ఎన్టీఆర్ కు వున్న ఔన్నత్యం రాజశేఖర్ రెడ్డికి లేదు అలాగే వైఎస్సార్ కు వున్న ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఎన్టీఆర్ కు లేదని పేర్కొన్నారు. దాడిశెట్టి రాజా ఒక అజ్ఞాని. పేకాట ఆడటం, ఆడించడం తప్ప అతడికేమీ తెలియదని జవహర్ మండిపడ్డారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. టిడిపి నేతలు పేరుమార్పు విషయమై ఏపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన నేతలు కూడ వీటికి కౌంటర్ ఇస్తున్నారు. తమకు ఎన్టీఆర్ అంటే గౌరవం ఉండటం వల్లే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరు స్పందించలేదని, పైగా చంద్రబాబుకు మద్దతు పలికారని, కానీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడ టార్గెట్ చేస్తున్నారు.