Site icon Prime9

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. దర్యాప్తులో నిన్ హైడ్రేట్ పరీక్ష

Viveka Murder Case

Viveka Murder Case

Viveka Murder Case: దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి రాసిన చివరి లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్‌ పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిన్‌హైడ్రేట్‌ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దీనిపై నిందితుల అభిప్రాయాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై జూన్‌ 2న సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.

 

వేలిముద్రల గుర్తింపుకు నిన్ హైడ్రేట్(Viveka Murder Case)

వివేకా హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖను సీబీఐ అధికారులు గతంలో సీఎఫ్‌ఎస్‌ఎల్‌ పంపించి.. లేఖను ఒత్తిడిలో రాశారా? లేదా? తేల్చాలని లేఖ రాశారు. అనంతరం వివేకా రాసిన ఇతర లేఖలను పోల్చి చూసిన ఫోరెన్సిక్‌ నిపుణలు తర్వాత ఆయన ఒత్తిడిలో లేఖ రాసినట్లు తేల్చారు. తాజాగా లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్‌ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ను సీబీఐ అధికారులు కోరారు.

 

జూన్‌ 2న విచారణ(Viveka Murder Case)

ఈ పరీక్ష ద్వారా లేఖపై చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని వివరించింది. వివేకా హత్య కేసు విచారణలో ప్రసుత్తం లేఖ కీలక సాక్ష్యంగా ఉంది. ఒకవేళ పరీక్షలో లేఖ దెబ్బతింటే.. దర్యాప్తు, ట్రయల్‌పై ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఒరిజినల్‌ లెటర్ కు బదులుగా కలర్‌ జిరాక్స్‌ను రికార్డులో భద్రపరిచి దాన్ని సాక్ష్యంగా పరిగణించేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉండటంతో .. నిన్‌హైడ్రేట్‌ పరీక్షకు అనుమతించాలని కోరారు. వివేకాతో బలవంతంగా లేఖ రాయించినట్లుగా దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై జూన్‌ 2న న్యాయస్థానం విచారణ జరపనుంది. వివేకా కేసు విచారణ గడువు జూన్ 20 వరకు మాత్రమే ఉంది. కావున దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

 

Exit mobile version