Vijayawada: అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు. ఒకే రాజధాని కావాలంటూ అమరావతి జేఏసి చేస్తున్న మహా పాదయాత్రకు ఏపి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన తరుణంలో కేంద్ర మంత్రి మాటలు విడ్డూరమేనని చెప్పాలి.
ఏపిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జాతీయ రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం సరిగా లేదని ఆరోపించారు. విజయవాడ వద్ద పశ్చిమ బైపాస్ పనులను ఆయన పరిశీలించారు. రాజధానులు ఎన్ని పెట్టుకొన్న అభివృద్ది కుంటుపడకూడదని హితవు పలికారు. అమరావతి అభివృద్ది చెందాలని కేంద్రం కోరుకుటుందన్న నారాయణ స్వామి రాజధానిగా అమరావతిని గుర్తించబట్టే ఎయిమ్స్ ను కేటాయించిందని స్పష్టం చేశారు.
దివ్యాంగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఒంగోలులో మంగళవారం దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, మాన్యువల్ ట్రై సైకిళ్లు, చక్రాల కుర్చీలు, ఇతర సహాయాలను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ వివిధ రకాల సహాయాలు అవసరమైన వారిని గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత చొరవ చూపాలని చురక అంటించివున్నారు.