Tirumala Srivari Properties: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు, 10,258.37 కేజీల బంగారం ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది. మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగినట్టుగా తెలిపింది. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా, అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది.
టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. జాతీయ బ్యాంకుల్లోనే టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని అన్నారు. డిసెంబర్ నుంచి ప్రయోగాత్మకంగా ఉ. 8 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం అమలు చేయనున్నట్టుగా తెలిపారు. టీటీడీ డిపాజిట్ల పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్‌లో 22.72 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని హుండీ కానుకల ద్వారా రూ. 122.23 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు.