Site icon Prime9

Supreme Court: అమరావతి రాజధాని కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా

supreme-court

New Delhi: రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. అమరావతి పై 8, రాష్ట్ర విభజన పై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్నితీసుకు రావడంతో అమరావతి జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రాజధానుల పై ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ తో పాటు రాష్ట్ర విభజన పై దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు కలిపి విచారించింది.

ఏపీ ప్రభుత్వం తరపున కోరిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వి, మాజీ ఏజీ వేణుగోపాల్ లు వాదించారు. కేసులను విడి విడిగా విచారించాలని ప్రభుత్వం తరపున కోరామని వారు తెలిపారు. హైకోర్టులో అమరావతి రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను కేకే వేణుగోపాల్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీం కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టులో ధిక్కార పిటిషన్ల పై రైతుల ఒత్తిడి లేకపోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మూడు రాజధానులను తెర మీదికి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులను తెర మీదికి తీసుకు వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అమరావతిలో రాజధానిని అభివృద్ది చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.

Exit mobile version
Skip to toolbar