Janasena: రాళ్లదాడికేసు.. 62 మంది జనసేన నేతలకు బెయిల్ .. 9 మందికి రిమాండ్

విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 11:58 AM IST

Janasena: విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి జనసైనికులకు ఊరట నిచ్చారు. 62 మంది జనసేన నాయకులకు 10 వేల రూపాయల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. మరో 9 మందిపై 307 సెక్షన్ తొలగించిన 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ కు తరలించారు. వారికి ఈ నెల 28 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

మొదట అరెస్ట్ చేసిన జనసైనికులను సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో వారిని వాహనాల్లో మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. అక్కడ ఎయిర్ పోర్టు ఘటనపై పూర్తిగా విచారించిన మెజిస్ట్రేట్.. జనసైనికులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఏ – 1, ఏ – 9 నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ను తీవ్ర గాయం కేసుగా మార్చారు. అంటే సెక్షన్ 307 ను తొలగించి సెక్షన్ 326 గా మార్చారు. వీరికి మాత్రం రిమాండ్ విధించారు. మొత్తం తొమ్మిది మంది జనసేన నాయకులకు రిమాండ్ విధించారు. ఈనెల 28 వరకు వీరు రిమాండ్ లో ఉండనున్నారు. దీంతో పోలీసులు రిమాండ్ విధించిన కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీనును కోర్టు నుంచి సెంట్రల్ జైల్ కు తరలించారు.

మరోవైపు, విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ) బస చేసిన నోవాటెల్ హోటల్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆ హోటల్ వద్దకు భారీ ఎత్తున జనసేన నేతలు కార్యకర్తలు, పవన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో నోవాటెల్ హోటల్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. హోటల్‌ ఎదుట జన సైనికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.