Rains In Ap: ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచే వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే, ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒక రోజు ముందుగానే వానలు పడనున్నాయి.
కొనసాగుతున్న ద్రోణి..(Rains In Ap)
జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దాని ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధవారం నుంచి 4 రోజులపాటు వర్షాలు పడే ఆస్కారం ఉంది.
పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మార్చి 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖ,
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల,
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ , తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది.
ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు(Rains) అవకాశం ఉన్నట్టు తెలిపింది.
రైతులకు ముందస్తు హెచ్చరికలు
ఈ ద్రోణి సందర్భంగా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. పంటలు దెబ్బతినకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించింది.
మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ట్రోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 40. 65, నంద్యాల జిల్లా గాజులపల్లిలో 40.61,
అవుకులో 40.53, గోనవరంలో 40.1 డిగ్రీల చొప్పున మంగళవారం ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.