Amaravati: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల సెగ తగిలింది. స్టైఫండ్ 42 శాతానికి పెంచాలంటూ డాక్టర్లు కోరికను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసు కూడా అందించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ఈ నెల 26 నుంచి ఓపీ సేవలను నిలిపివేయనున్నామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. అప్పటికీ తమ న్యాయమైన కోర్కెను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రానట్లు అయితే సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ నెల 25 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 27 నుంచి వార్డులు, నాన్ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ నెల 27 నుంచి అత్యవసర సేవలను తప్పించి మిగిలిన సేవలను కొనసాగించమని వారు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో హౌస్ సర్జన్లకు రూ.30,000, బ్రాడ్ స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు స్టైఫండ్ ఇస్తున్నారని, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80,000 వేతనం ఇస్తున్నారన్నారు. ఏపీలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19,589, బ్రాడ్ స్పెషాలిటీ పీజీలకు రూ.44,075 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53,869 వేతనం మాత్రమే ఇస్తున్నారని జూనియర్ వైద్యులు పేర్కొన్నారు.
ఇదే విషయంపై ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ స్పందిస్తూ రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె నోటీసులు ఇవ్వడం నిజమేనని చెప్పారు. అయితే త్వరలో జూనియర్స్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి:Rahul Gandhi: ఏపీ ప్రజలకు పార్లమెంటులో చేసిన చట్టాలు అందలేదు.. రాహుల్ గాంధీ