Site icon Prime9

PM Narendra Modi: ఏపీని, జగన్ ను లైట్ తీసుకున్న ప్రధాని మోదీ

AP and Jagan

AP and Jagan

Andhra Pradesh: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి బహిరంగ సభ, ఇతర ఏర్పాట్లను చేసింది. లక్షల మందిని జనాన్ని సమీకరించింది. అయితే ప్రధానమంత్రి మోదీ నోట కనీసం చిన్న ప్రశంస కూడా రాలేదు.

సీఎం జగన్ ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. అభివద్ధి రథసారధి అన్నారు. రైల్వేజోన్, పోలవరం, ప్రత్యేకహోదా ఇలా అన్ని అంశాల పై సానుకూలత చూపాలని వేడుకున్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ అసలు జగన్ ప్రసంగంలో ప్రస్తావించిన ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదు. నలభై నిమిషాల పాటు ప్రసంగంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విజ్ఞప్తుల పై మాట్లాడలేదు. మోదీ ఏపీ పర్యటన ఖరారైన తర్వాత, భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి మూడు లక్షల మందిని సమీకరించి మోదీనే ఆశ్చర్యపోయేలా చేయాలనుకున్నారు. విజయసాయిరెడ్డి జన సమీకరణ చేశారు. ఇంతా చేస్తే, మోదీ కనీసం ఏపీ ప్రభుత్వం గురించి కానీ, ఏపీ సీఎం గురించి కానీ, ఏపీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ఒక్క మాట కూడ మాట్లాడలేదు. అసలు అలాంటి ప్రస్తావనే తీసుకు రాలేదు.

మోదీ ప్రసంగం మొత్తం తమ పాలన, తమ పనులు, తమ అభివృద్ధి, తమ నేతల కష్టం గురించి చెప్పుకున్నారు. విశాఖ విషయంలో తమ పార్టీ నేతల కృషిని కూడా గుర్తు చేసుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టించిన విజయసాయిరెడ్డికి అసలు వేదిక పై చోటు దక్కలేదు. మోదీనే కాదు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదు. ఏపీలో అభివృద్ధి జరుగుతోందని చెప్పలేదు. మోదీ ప్రసంగంలో అసలు జగన్ మాట కానీ, ఏపీ ప్రభుత్వం ప్రస్తావన కూడా రాలేదు.

ఇలాంటి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే, ప్రసంగం ప్రారంభంలోనో, మధ్యలోనే చివరిలోనే కనీసం మోదీ అభినందన పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతారేమో అనుకున్నారు. చివరికి అలాంటిది కూడా లేదు. ఆయన ప్రశంస కూడా ఇవ్వలేదంటే, మోదీ మనసులో ఏముందో?

Exit mobile version