New Delhi: ప్రస్తుత వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో వివేకా హత్య కేసు విచారణ ఎలాంటి పురోగతికి నోచుకోకుండా ఉందని సునీతా న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారణకు సహకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలను సైతం పోలీసులు, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. కేసులోని నిందితులు ఒక్కొక్కరుగా బెయిల్ పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐకి సైతం రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసారు. కేసుకు సంబంధించిన వివరాలను తెలియచేయాలంటూ అక్టోబర్ 15కు సుప్రీం వాయిదా వేసింది.
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ తన చిన్నాన్న హత్య పై పెద్ద రాద్దాంతమే చేసారు. చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య పై పెద్దగా స్పందిచక పోవడంతో పాటుగా సీబీఐ అధికారుల పైనే రాష్ట్ర పోలీసులు కేసు వేయడం పై వివేకా కుమార్తె సునీత రెడ్డి పలు అనుమానాలను వ్యక్తం చేసివున్నారు. ఈ క్రమంలో కేసును ఏపీ టు తెలంగాణకు మార్చాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం పై వైకాపా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.