pawan kalyan varahi yatra: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి బుధవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులతో సభ జనసంద్రోహం అయింది.
పరిపాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని, నాయకులు బాధ్యతగా లేనప్పుడు కచ్చితంగా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. దోపిడీ, అవినీతిపరులతోనే తన పోరాటమని స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్నారని వైపీపీపై మండిపడ్డారు. ప్రజలను దోపిడీ చేస్తూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 అసెంబ్లీ సీట్లున్న జగన్ పార్టీ.. జనసేనను టార్గెట్ చేస్తోందంటే పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.
అదే విధంగా వైఎస్సార్సీపీ నేతలు చేసిన తప్పుడు పనులపై తన దగ్గర చాలా ఫైళ్లున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం లేదని.. ఒక పాలసీ విధంగానే విమర్శలు చేస్తున్నాని తెలిపారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. కానీ 3 రాజధానులంటూ జగన్ నాటకాలు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైసీపీ సర్కార్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్‌లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెబుతున్నారన్నారు. ఒక కులానికే కీలక పోస్టులన్నీ పరిమితం చేయడం సరికాదని అన్నారు. అమరావతి ఒక కులానిది మాత్రమే అనుకుంటే జగన్ ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్పార్సీపీకి ఏటీఎం లాంటిదని విమర్శలు గుప్పించారు.