Site icon Prime9

Pawan Kalyan : విస్సన్నపేటలో వైసీపీ భూ ఆక్రమణలపై విరుచుకుపడ్డ జనసేనాని.. జగన్ కు మాస్ వార్నింగ్

Pawan Kalyan mas warning to cm jagan over vissannapeta lands grabbing

Pawan Kalyan mas warning to cm jagan over vissannapeta lands grabbing

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో దూసుకుపోతున్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన నేడు అనకాపల్లి నియోజకవర్గంలోని విస్సన్నపేట గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు ముందుగానే తన పర్యటన వివరాలను పవన్ ప్రకటించడంతో.. అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలుకుతూ భారీ సంఖ్యలో జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఆక్రమణలకు గురై, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  ఓ వైపు ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లేవని, కానీ విస్సన్నపేట గ్రామంలో 13వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న 600 ఎకరాలు పోరంబోకు, దళితుల భూములని, అంతేకాదని, ఇది క్యాచ్‌మెంట్ ఏరియా అన్నారు. ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవాడు లేడని స్థానిక ఎమ్మెల్యేలు కూడా వత్తాసు పలుకుతున్నారని పవన్ మండిపడ్డారు. తెలంగాణ లోనూ ఇలాగే దోచేస్తే తన్ని తరిమేశారన్నారు.

క్యాచ్‌మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని పవన్ ప్రశ్నించారు. తాను సీఎం జగన్‌కే చెబుతున్నానని.. మధ్యలో వచ్చి మాట్లాడే మంత్రులను పట్టించుకోనన్నారు. సీఎంగా ఉంటూ ఆయన చేసే అవినీతిని బయటపెడతామన్నారు. ఈ అక్రమాలకు జగన్, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయని, ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారన్నారు.

గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, కానీ ఇక్కడి రియాల్టీ వెంచర్‌లో 100 అడుగుల రోడ్డు, హెలిప్యాడ్ ఉందన్నారు. దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమించి రూ.13వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక రైతులు భూకుంభకోణంపై ఫిర్యాదు చేశారని, అందుకే దీనిని పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు.

Exit mobile version