Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇదని కొనియాడారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలని హితవు పలికారు. కాపు కులంలో పుట్టినా.. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తినని.. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయనని స్పష్టం చేశారు.
అదే విధంగా వైకాపా కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి అని అన్నారు. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీకి అధికారం వచ్చిందని.. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదని వెల్లడించారు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందని.. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని వ్యక్తం చేశారు.