Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ .. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి ముందుకెళ్లాలని జనసేన పార్టీ కార్యకర్తకలకు సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని ఉద్బోధించారు.
వచ్చే ఎన్నికల్లో సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళదామని పవన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయభేరి మోగించాలని, ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళుతున్నామని వివరించారు. ఇవాళ తాము సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందని పవన్ పేర్కొన్నారు.
అలానే స్టేట్ కమిటీ, వివిధ కమిటీల్లో కొత్తగా పదవులిచ్చిన వారికి పవన్ కళ్యాణ్ నియామక పత్రాలను అందజేశారు. పీఏసీలోకి మాజీ మంత్రి పడాల అరుణ, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా పంచకర్ల రమేష్ బాబు సహా పలువురిని పవన్ నియమించారు.