Andhra Pradesh: జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు సరికాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రభుత్వంలోని పెద్దలు ఇవాళ ఉంటారు. పదవి పోతే ఇంటికి పోతారు. పోలీసులు మాత్రం సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే ఉంటారని అన్నారు. మరోపార్టీ అధికారంలోకి వస్తే, పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడదని పవన్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలో జనసేన జెండావిష్కరణలను వైసీపీ అడ్డుకోవడం తమ ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని అన్నారు.
జగ్గయ్యపేటలో జెండా దిమ్మెను వైసీపీ శ్రేణులు జేసీబీతో కూల్చివేశారని, జనసేన కార్యకర్తలను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు.