Kotamreddy Srinivasulu: కోటంరెడ్డిపై కారుతో దాడి

తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు శ్రీనివాసులును కారుతో ఢీ కొట్టాడు.

Kotamreddy Srinivasulu: ఏపీలో దాడులు ప్రతిదాడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వాటికి రాజకీయ హంగులు అద్దుతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తాజాగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు శ్రీనివాసులును కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో గాయాలపాలైన శ్రీనివాసులును కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు ప్రజయ్, రాజశేఖర్ రెడ్డి స్నేహితులు.. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రజయ్ ఇంటికి వచ్చాడు.
మద్యం మత్తులో ప్రజయ్ తో గొడవపడ్డాడు. శ్రీనివాసులు కల్పించుకుని రాజశేఖర్ రెడ్డికి సర్దిచెప్పి పంపించారు. బయటకు వెళ్లినట్లే వెళ్లి వేచి చూసిన రాజశేఖర్ రెడ్డి.. శ్రీనివాసులు బయటకు రాగానే తన కారుతో ఢీ కొట్టి పారిపోయాడు. కాగా ఈ దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ దాడికి పాల్పడ్డ రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో గాయపడిన కోటంరెడ్డిని చంద్రబాబు కాల్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో ముస్లిం టోపీ ధరించిన మాజీమంత్రి.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ క్లారిటీ