Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు.
‘ఎందరు పిల్లులుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రస్తుతం అమ్మ ఒడి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. మహిళలను ఏ మొహం పెట్టుకొని జగన్ ఓట్లు అడుగుతారు? విద్యుత్, గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచారు. 100 సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన ఏకైక వ్యక్తి జగన్. బీసీ సోదరుల వెన్నెముక విరగొట్టారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోతపెట్టారు. కోత పెట్టిన రిజర్వేషన్లను తిరిగి తీసుకువస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం. బీసీలపై 26 వేల దొంగ కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు నిలిపివేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను తిరిగి అమలు చేస్తాం. మైనార్టీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం’ అని లోకేశ్ వెల్లడించారు.