Nara Chandrababu : చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేత

టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 02:06 PM IST

Nara Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు మరోసారి  చుక్కెదురైంది. ఈ మూడింటిని ధర్మాసనం కొట్టివేటయంతో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. అలాగే బెయిల్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు, టీడీపీ నేతలకు ఈ పరిణామం షాకింగ్ విషయమనే చెప్పాలి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది.

ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని ఆరోపించింది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్‌ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తుంది.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

కాగా చంద్రబాబు (Nara Chandrababu) కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైనా.. మరోపక్క సుప్రీం కోర్టులో రిలీఫ్ వస్తే ఆ తరువాత కస్టడీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈరోజు మధ్యాహ్నాం విచారణ జరుగనుంది. అక్టోబర్ 3న ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం దీనికి సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించింది. వీటిని పరిశీలించి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దీంతో సుప్రీంకోర్టులో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.