Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేయగా రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువచ్చారు. తాజాగా ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆయన అరెస్ట్ కు నిరసనగా తెదేపా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా చంద్రబాబును కలిసేందుకు వారి కుటుంబ సభ్యులను సిట్ కార్యాలయం లోకి అనుమతించారు. సీఐడీ అధికారులు చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు. మరోవైపు బాలకృష్ణ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. అయితే సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు తరఫున వచ్చిన నలుగురు అడ్వకేట్లను పోలీసులు అనుమతించడం లేదు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు అడ్వకేట్లు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాదులను ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్రా విజయవాడ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సిద్ధార్థ లూధ్రా అండ్ టీమ్ .. కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయింది. చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు సిద్ధార్థ లుధ్రా వినిపించే అవకాశం ఉంది. చంద్రబాబు కేసులను సిద్దార్థ్ చూసుకుంటారు. అమరావతి కేసును కూడా సిద్దార్థ్ వాదించారు. మరోవైపు సీఐడీ, సిట్ తరపున వాదనలు వినిపించనున్నారు.
మరో వైపు టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ అపాయింట్‍మెంట్ కోరారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోందని, పోలీసు రాజ్యం తప్ప ప్రజాస్వామ్యం లేదన్నారు. రాత్రి 7.15కు గవర్నర్‍ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.