Pilli Subhash Chandra Boss : 2024లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీ చేస్తానని వైకాపా సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్ మాట్లాడారు. అంతే కాకుండా తాను పార్టీలో కూడ ఉండనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుండి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
పార్టీకి నష్టమైనా సరే తాను క్యాడర్ ను వదులుకోవడానికి సిద్దంగా లేనని చంద్రబోస్ తెలిపారు. తమ కుటుంబానికి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని అన్నారు. మంత్రి చెల్లుబోయిన వర్గం నిర్వహిస్తున్న సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. కాగా గత వారం క్రితం పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు సమావేశం నిర్వహించగా.. ఈరోజు మంత్రి వేణు వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.
కాగా వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణు మరోసారి బరిలోకి దిగుతారని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించారు.ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని.. అందుకే తన కొడుకు సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారని సమాచారం అందుతుంది.