Anantapur: వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావలసిన అద్దె ఇప్పించి ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని డిమాండ్ చేస్తున్నారు. అద్దె అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఇంటి యజమాని ఆరోపించారు.
ఎంపీ గోరంట్లమాధవ్ అనంతపురం నగరంలోని రామ్ నగర్ 80 అడుగుల రోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటికి రూ. 2 లక్షలకు పైగా అద్దె, విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తెలిసింది. అద్దె బకాయిలు చెల్లించకపోగా ఇల్లు ఖాళీ చేయనని బెదిరిస్తున్నారని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు. అద్దె అడిగితే టిప్పర్లతో తొక్కించి చంపుతామంటూ గోరంట్ల మాధవ్ అనుచరులు బెదిరిస్తున్నారని మల్లికార్జున రెడ్డి చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్లో దీనిపై పంచాయితీ జరిగినట్లు సమాచారం. నాలుగో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన, టూటౌన్ సీఐ శివరాముడు, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకుని మల్లికార్జునరెడ్డితో మాట్లాడారు. అయితే సమస్య కొలిక్కిరాకపోవడంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం.