Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో జులై 17,18,19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు జులై 16వ తేదీన అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాకుండా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద ఉన్న ఆవర్తనం ప్రభావం బలహీనపడి వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్ తీరం వైపుగా దక్షిణం దిశగా వంగి ఉందని వెల్లడించింది.
ఈ ఆవర్తనం ప్రభావం రాగల రెండు మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా మరొక ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
మరో ఆవర్తనం కూడా(Weather Update)
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే నేడు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే ఈ నెల 18 నాటికి వాయువ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు మరింత ఊపందుకునేందు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.