Visakhapatnam: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖలో అలీప్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన పొలిటికల్ పార్టీ కాదని అది కేవలం సినిమా పార్టీ అన్నారు. అటువంటి పార్టీ కోసం పది మంది మంత్రులు కూర్చోని మాట్లాడుకోవలసిన అవసరం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు. రాజకీయ జీవితంలో కూడా విలువలు లేని వ్యక్తి అని విమర్శించారు. రంగా హత్య కోసం మాట్లాడిన పవన్ కల్యాణ్ కొద్దిసేపటికే మాట మార్చి టిడిపి నాయకులతో కలిసి మాట్లాడటం చూస్తూ ఉంటే పవన్ కు కాపుల పై ఎంత ప్రేమ ఉందొ చూస్తే అర్థమవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పది సీట్లు గెలిస్తే చాలు, అని అనడం చూస్తే పవన్ కేవలం చంద్రబాబును సీఎం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప పవన్ సీఎం కావడానికి కాదన్నారు. ఇప్పటికైనా కాపులు, జనసేన కార్యకర్తలు కళ్ళు తెరిచి నిజా నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ కాపుల కస్టోడియన్ కాదని, అలాంటి అతనికి నాలుగు నెలలుగా కాపులు ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. ముద్రగడ పై దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారంటూ ధ్వజమెత్తారు. చిరంజీవి, దాసరి నారాయణరావు స్పందించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. 2014లో చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేశారని, 2019లో విడిపోయి పోటీ చేశారని, 2024లో మళ్లీ కలిసి పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కులాల మేలు కోసం పెట్టిన కార్పొరేషన్ల వల్ల మేలు జరగలేదని పవన్ కల్యాణ్ అంటున్నారని, కులాలకు ఇంతకంటే ఎక్కువగా ఏ ప్రభుత్వంలో అయినా సామాజిక న్యాయం జరిగిందా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. దాదాపు 1.8 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో మూడున్నరేళ్ళలోనే వైసీపీ ప్రభుత్వం వేసిందన్నారు.