Site icon Prime9

Pawan Kalyan Varahi Yatra : జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో జనసేన – తెదేపా ప్రభుత్వం : పవన్ కళ్యాణ్

janasena chief Pawan Kalyan Varahi Yatra live from pedana constituency

janasena chief Pawan Kalyan Varahi Yatra live from pedana constituency

Pawan Kalyan Varahi Yatra : జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని.. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన – తెదేపా ప్రభుత్వం రాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..  మడ అడవులపై గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి పోరాటం చేస్తున్న జనసైనికులపై పవన్ ప్రశంసలు కురిపించారు. జనసైనికులు మట్టి తవ్వకాలు అడ్డుకుంటే, అక్రమ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారని.. ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహం కేసులు పెట్టింది వైసీపీ సర్కారేనన్నారు.

కొత్త పాస్ బుక్ కు 10వేలు, రొయ్యల చెరువు ట్రాన్స్ ఫార్మర్ వేయించుకోవాలంటే 2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అది కూడా ఇష్టమొచ్చిన కంపెనీ ట్రాన్స్ ఫార్మర్ వేయించుకుంటే ఒప్పుకోరని అన్నారు. తీర ప్రాంతాలను దోచేశారని.. ఇసుక దిబ్బలను తవ్వేశారని.. వాటితో పాటు మడ అడవులను సైతం ధ్వంసం చేసి, అక్రమంగా రొయ్యల చెరువులు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

హత్యలు చేసే వారికి.. చేయించేవారికి జేజేలు కొడుతున్నారని విమర్శించారు. జగనన్న.. ఏపీ బంగారు భవిష్యత్తుకు కాదు.. ఆయనో విపత్తు అని ఫైర్ అయ్యారు.  28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని.. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఓట్లు వేయించుకునేందుకే వైకాపా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని.. అమలు వరకు వచ్చేసరికి వైకాపా పథకాల్లో అంతా డొల్లతనం కనబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి దగ్గర దేహీ అని అడుక్కునే పరిస్థితి రావొద్దని, అందుకు తనను తిట్టిన వారితోనూ చేయి కలిపేందుకు సిద్ధంగానే ఉన్నానన్నారు. కనీసం రాజధాని కూడా సాధించుకోలేకపోయామని, ఇలానే ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలన్నారు.

జాతీయ ఉపాధి పథకం కింద వచ్చిన రూ.337 కోట్లలో రూ.6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతా నిధులను జగన్ మళ్లించారన్నారు. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందని.. వైకాపా ప్రభుత్వం.. ఉపాధి కూలీల పొట్ట కొట్టిందంటూ వాపోయారు. రాష్ట్రంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు, రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే వీసా తీసుకునే పరిస్థితి నెలకొందన్నారు. 2014లో రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి తాను మద్దతు పలికానని, ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మరోసారి టీడీపీతో కలిసి వస్తున్నామన్నారు.

సగానికి సగం ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని.. ప్రశ్నించే వారిపై పలురకాల కేసులు పెడుతున్నారన్నారు. అతి ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే నమోదయ్యాయి అని పవన్ చెప్పారు. ప్లాస్టిక్‌పై నిషేదం పేరుతో ప్లెక్సీలను నిషేధించారని.. కానీ నా సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్‌పై వీరికి నిషేధం గుర్తుకు వస్తుందన్నారు. కొనకళ్ల నారాయణపై దాడి.. చాలా ఆవేదన కలిగించిందని.. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని పిలునిచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన – తెదేపా ప్రభుత్వం రాబోతోందని పవన్‌ (Pawan Kalyan Varahi Yatra) ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

Exit mobile version