Harirama Jogaiah : మాజీ మంత్రి, సీనియర్ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో… కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి అని కోరారు. 85 సం. వయసులో శ్రీ హరిరామజోగయ్య గారు దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నానని తెలిపారు. శ్రీ హరిరామజోగయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణం చర్చలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ పరామర్శించారని తెలుస్తుంది. వైద్యులతో హరి రామ జోగయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం అందుతుంది. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు.
శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారి దీక్షపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పందన :
* కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. (1/2)
— JanaSena Party (@JanaSenaParty) January 2, 2023
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన విరమించుకోవాలని పోలీసులు సూచించారు. జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పాలకొల్లులో జోగయ్య ను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత…
హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది. మరోవైపు ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిరామజోగయ్యకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని… వైద్యం అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారని సమాచారం అందుతుంది. మరోవైపు హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు పోలీసులు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే వైద్యం అందించాలని, అందుకు సహకరించేలా ఒప్పించాలని తెలిపారు. అయితే పోలీసుల తీరుపై సూర్యప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం ఆస్పత్రికి తీసుకెళ్తామని తన తండ్రిని ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రిలో ఉంచడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.