Andhra Pradesh: పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
సీఎం జగన్ ప్రభుత్వంలో 18,63,562 ఇండ్లు పేదలందరికి ఇళ్లు పధకం ద్వారా లబ్దిదారులకు కేటాయించారన్నారు. అయితే వాటిలో కేవలం 1,52,325 ఇండ్లు మాత్రమే నిర్మించారని, పేర్కొన్న మేర 8శాతానికి మాత్రమే పరిమితం అయిందని జనసేన పార్టీ ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపింది. ఏటా కేంద్రం నుండి రూ. 5వేల కోట్లు దాకా ఇండ్ల నిర్మాణాల కింద మంజూరైన నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని జనసేన విమర్శించింది.
ఉత్తరాంద్ర గురించి పదే పదే మాట్లాడే నేతలు పేదలకు కేటాయించిన ఇండ్లలో ఎన్ని పూర్తి అయ్యాయో చెప్పగలరా అంటూ జనసేన ప్రశ్నించింది. వేల సంఖ్యలో పునాదుల్లోనే ఆగిపోయాయని పేర్కొనింది. అమ్మ పెట్టదు, అడక్క తిన్నీయదు అన్న చందంగా రాష్ట్రంలో పూర్తైన టిడ్కో ఇండ్లను లబ్దిదారులకు ఇప్పటివరకు అందించలేకపోవడం జగన్ ప్రభుత్వ అసమర్ధతకు నిలువెత్తు నిదర్శనంగా జనసేన పేర్కొనింది. ముఖ్యమంత్రి సమీక్షా, సమావేశాలకే పరిమితం అవడాన్ని జనసేన తప్పుబట్టింది. సంబంధిత శాఖ మంత్రి కల్లిబొల్లి మాటలతో, అర్ధం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు.