CM YS JAGAN : ఏపీ సీఎం జగన్.. తాజాగా వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల వైయస్సార్ కాపు నేస్తం నిధులను అందించారు. ఈ క్రమంలో అర్హులైన 3,57,844 మంది మహిళలకు ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది.
అలానే ఈ సభ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొదటిసారి చంద్రబాబు అరెస్ట్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 45 ఏళ్లుగా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని జగన్ విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయన సాక్ష్యాలతో సహా దొరికిపోయారని.. అందుకే అరెస్ట్ అయ్యారని అన్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అని.. కొందరు దొంగల ముఠా సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌ని జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారని అన్నారు. చట్టం అందరికీ ఒకటే అని చెప్పిన వాళ్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరని, అలా చెప్పడం వల్లే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
సాక్ష్యాలు ఆధారాలు చూసిన తరవాతే కోర్టు రిమాండ్‌కి పంపిందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్ని సార్లు మోసం చేసినా ఆయనను రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఇంత అవినీతి జరుగుతున్నా ప్రశ్నించడం లేదని పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ములాఖత్ అని చెప్పి పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. జనం సొమ్ముని దోచుకున్న వ్యక్తిని జైల్లో పెట్టకూడదా అని ప్రశ్నించారు. ములాఖత్‌లో మిలాఖతై పొత్తు పెట్టుకున్న వాళ్లను ఏం చేయాలో మీరే చెప్పాలంటూ పవన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఎల్లో మీడియా నిజాల్ని చూపించదని.. అవినీతి పరులకు మద్దతుగా ఉంటున్నాయని సీఎం జగన్ ( CM YS JAGAN )అన్నారు.